వరదల నష్టంపై తక్షణసాయం రూ.200 కోట్లు!సర్కారు మంజూరు
హైదరాబాద్, సెప్టెంబరు 3: ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న భారీ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు తక్షణసాయం కింద రూ.200 కోట్లు మంజూరు చేసింది. మంగళవారం విపత్తులశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తీవ్రంగా ప్రభావితమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున, మిగిలిన 26 జిల్లాలకు రూ.5 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నిధులను ప్రధానంగా రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, తాగునీటి సరఫరా మరమ్మతులకు మాత్రమే వినియోగించాలని, పంటనష్ట పరిహారం లేదా కొత్త పనులకు ఖర్చు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖర్చైన నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేసింది.
ఆగస్టు 25 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఇందులో కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 50 సెం.మీ.కన్నా ఎక్కువ వర్షపాతం, మిగతా జిల్లాల్లో 25–40 సెం.మీ. వర్షపాతం నమోదై మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు నష్టపోయాయి. పంటనష్టం, ఆస్తి, ప్రాణ నష్టాలు కూడా చోటుచేసుకున్నట్టు అధికారుల నివేదికల్లో వెల్లడైంది.
Post a Comment