-->

వరద నష్టం నివేదికతో కేంద్ర సహాయం కోరిన తెలంగాణ మంత్రులు

వరద నష్టం నివేదికతో కేంద్ర సహాయం కోరిన తెలంగాణ మంత్రులు


తాజా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన తెలంగాణ రాష్ట్ర పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క‌, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుసుకున్నారు.

మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో భట్టి విక్రమార్క సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ అంశాలతో పాటు పామాయిల్‌పై సుంకాలను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యాసంస్థలకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కూడా కోరారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ –
👉 “సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలుస్తాం. వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి, కేంద్ర సహకారం కోరుతాం” అని తెలిపారు.

అదేవిధంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ –
👉 “వందేళ్లలో ఎన్నడూ లేని వర్షాలు కురిశాయి. రహదారులు, పంటలు, ఆస్తులకు భారీ నష్టం జరిగింది. ముఖ్యమంత్రి స్వయంగా ఏరియల్ సర్వే చేసి, ప్రత్యక్ష పర్యటన చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ప్రాథమిక నివేదికను హోం మంత్రి అమిత్ షాకు అందజేస్తాం. త్వరలో పూర్తి నివేదికను సమర్పిస్తాం” అని తెలిపారు.

కేంద్రంపై విమర్శలు చేస్తూ –
👉 “గత వరదల్లో కూడా కేంద్ర బృందాలు వచ్చి చూసినా, తెలంగాణకు ప్రత్యేక సాయం రాలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇచ్చినట్లే తెలంగాణకూ ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలి. వరదల వలన రూ.5,000 కోట్ల నష్టం జరిగింది” అని తుమ్మల స్పష్టం చేశారు.

రాష్ట్ర మంత్రుల ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు అన్ని వర్గాల దృష్టి సారించింది. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793