10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత డ్రగ్స్ ముఠాకు ఈగల్ టీమ్ గట్టి షాక్!
హైదరాబాద్, అక్టోబర్ 09: నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా… మత్తు పదార్థాల వ్యాపారం మాత్రం ఆగేలా లేదు. తాజాగా నగరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ తయారీ జరుగుతుందనే సమాచారం ఆధారంగా పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈగల్ టీమ్ జీడిమెట్ల పరిధిలోని సుచిత్రా క్రాస్ రోడ్స్ సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో ఉన్న సాయి దత్తా రెసిడెన్సీలో సోదాలు జరిపింది. అక్కడ అపార్ట్‌మెంట్‌లో రహస్యంగా డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. పోలీసులు ఎఫిడ్రిన్ అనే సింథటిక్ డ్రగ్ సుమారు 220 కిలోలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్స్ విలువ స్థానిక మార్కెట్‌లో రూ. 10 కోట్లకు పైగా, అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 70 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో వాస్తవాయి శివరామకృష్ణ పరమ వర్మ, దంగేటి అనిల్, మద్దు వెంకట కృష్ణ, ఎం. ప్రసాద్, ముసిని దొరబాబు అనే ఐదుగురు ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీరిలో నలుగురిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.
ప్రాథమిక విచారణలో వీరంతా కాకినాడ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందినవారిగా తెలిసింది. హైదరాబాద్‌లో నివాసం ఏర్పరుచుకుని, రహస్యంగా డ్రగ్స్ తయారీ, సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. డ్రగ్స్ మూలాలను పూర్తిగా వెలికితీయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Post a Comment