-->

ప్రైవేట్ చిట్టీలు నడిపి మోసం చేసిన వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష

ప్రైవేట్ చిట్టీలు నడిపి మోసం చేసిన వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష


కొత్తగూడెం లీగల్ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గారు ప్రైవేట్ చిట్టీలు నడిపి డిపాజిటర్లను మోసం చేసిన ఒక వ్యక్తికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

కేసు వివరాల ప్రకారం—కొత్తగూడెం బస్తికి చెందిన ఎం.డి. నిజాముద్దీన్, గంగాభిష్ణభట్టి ప్రాంతానికి చెందిన జక్కుల వెంకన్నతో పరిచయం ఉన్నాడు. తన పరిచయాన్ని ఉపయోగించుకుని వెంకన్న ప్రైవేట్ చిట్టీలు నడపడం ప్రారంభించాడు.

వెంకన్న వద్ద ఎల్.సుధ, పరపతి లక్ష్మణ్‌రెడ్డి, పేరం నరేష్, కోలా సాల్మన్ రాజు, పరపతి వీరబాబు, మణమ్మ, పెరుమాళ్ళు నాగేశ్వరరావు తదితరులు కలిపి మొత్తం 20 మంది చిట్టీలు వేయించుకున్నారు. వారు తమ బాకీలు తీర్చినప్పటికీ, వెంకన్న మొత్తం రూ.16,41,000/- చెల్లించకుండా మోసం చేసి పారిపోయాడు.

ఈ ఘటనపై బాధితులు కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పటి ఎస్‌ఐ జి. తిరుపతి వద్ద ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి ఇన్‌స్పెక్టర్ కే. కుమారస్వామి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు.

22 మంది సాక్షుల వాంగ్మూలాల అనంతరం, జక్కుల వెంకన్న నేరం నిరూపితమైంది. దీనిపై కోర్టు IPC సెక్షన్ 420 ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.3,000 జరిమానా, అలాగే తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ (ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్) యాక్ట్, 1999 ప్రకారం మరొక ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.3,000 జరిమానా విధించింది.

రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించవలసిందిగా కోర్టు పేర్కొంది.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదనను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి సమర్థంగా నిర్వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్‌.ఐ. ఆర్‌. ప్రభాకర్, లైజాన్ ఆఫీసర్ నేరేడు వీరబాబు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పీసీ కె. వీరన్న లు సహకరించారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793