అదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం! భయాందోళనలో ఏజెన్సీ గ్రామాలు
అదిలాబాద్, అక్టోబర్ 09: బోథ్ అటవీ రేంజ్ పరిధిలో చిరుత పులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. గత నాలుగు రోజులుగా పశువులపై దాడులు కొనసాగుతుండగా, రెండు ఆవులు మృతి చెందాయి. నిగిని అటవీ ప్రాంత సమీపంలో మేతమేస్తున్న పశువులపై చిరుత పులి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
చిరుత సంచారం కారణంగా సమీప గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో పొలాల్లోకి వెళ్లాలంటే భయంగా ఉందని, వ్యవసాయ కూలీలు కూడా వెనకడుగు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిగిని గ్రామానికి చెందిన దుర్వ గంగారాం, రేండ్లపల్లికి చెందిన సడుముకి లక్ష్మణ్‌ల ఆవులు చిరుత దాడిలో మృతి చెందాయి. అటవీ విస్తీర్ణం పెరగడంతో పాటు నీరు పుష్కలంగా లభించడం వలన వన్యప్రాణులు తరచుగా ఈ ప్రాంతాలకు వస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు.
చిరుత దాడిలో పశువులు మృతి చెందిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. అదే సమయంలో, చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి, గ్రామ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Post a Comment