🌏 ప్రపంచంలోనే నాలుగో స్థానంలో హైదరాబాద్
హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తోంది. ఐటీ, బయోటెక్, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నాలుగో స్థానాన్ని సాధించింది.
సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్–2024 తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కర్ణాటక రాజధాని బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో వియత్నాంలోని హో చి మిన్ సిటీ, మూడో స్థానంలో దేశ రాజధాని న్యూఢిల్లీ నిలిచాయి.
రిపోర్టు ప్రకారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆసియా ఖండం దూసుకుపోతుందని, 2033 నాటికి ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన అభివృద్ధి సాధించే నగరాల జాబితాలో హైదరాబాద్ కీలక స్థానాన్ని దక్కించుకుంటుందని పేర్కొంది.
సావిల్స్ రిసైలెంట్ సిటీస్ ఇండెక్స్‌తో కలిసి రూపొందించిన ఈ అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలను పరిశీలించారు. ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీస్ టాప్–15లో 14 నగరాలు ఆసియా ఖండానికే చెందినవిగా రిపోర్టు వెల్లడించింది.
అదే సమయంలో, యూనైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో 68 శాతం మంది నగరాల్లోనే నివసించే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, రియల్ ఎస్టేట్ రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని రిపోర్టు స్పష్టం చేసింది. ఐటీ రంగంలో బెంగళూరు–హైదరాబాద్ నగరాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని పేర్కొంది.

Post a Comment