తిరుమల కొండపై భక్తుల చూపు ఒకే మహిళపై… కారణం ఆమె అసాధారణ ఎత్తు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం రోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. సోమవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. అయితే ఆ రోజు అందరి చూపు మాత్రం ఒకే వ్యక్తిపై నిలిచిపోయింది — ఆమె ఎత్తు కారణంగా!
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఓ మహిళ దాదాపు ఏడు అడుగుల ఎత్తుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెను చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురై “వామ్మో… ఇంత ఎత్తు!” అంటూ చూసే తీరే వేరుగా కనిపించింది.
వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి భక్త బృందంతో కలిసి దర్శనానికి వచ్చిన ఆ మహిళ, శ్రీలంకకు చెందిన మాజీ నెట్‌బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగం అని తెలిసింది.
శ్రీవారి దర్శనం ముగించుకుని ఆలయం బయటకు వచ్చిన ఆమెను చూసేందుకు, వీడియోలు తీశేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆమె ఎత్తు కారణంగా జనంలో ఎక్కడ ఉన్నా స్పష్టంగా కనిపించడం విశేషం.
భక్తుల మధ్య “ఇంత ఎత్తైన మహిళను తిరుమలలో చూసింది ఇదే మొదటిసారి!” అనే చర్చ సాగింది.

Post a Comment