-->

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఆదివాసీల మహా ధర్నా

 

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఆదివాసీల మహా ధర్నా

ఏటూరునాగారం, నవంబర్‌ 3: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీలు సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. వైజంక్షన్‌లోని కుమ్రంభీం విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆదివాసీలు ఐటీడీఏ కార్యాలయం వద్దకు చేరుకొని జాతీయ రహదారిపై గంటన్నర పాటు ఆందోళన కొనసాగించారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని పలు మండలాల నుంచి సుమారు మూడు వేలమంది ఆదివాసీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఐటీడీఏ ఆవరణలోకి చొరబడేందుకు ప్రయత్నించిన మహిళా ఆదివాసీలను పోలీసులు అడ్డుకున్నారు.

జేఏసీ చైర్మన్‌ పూనెం శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ వట్టం ఉపేందర్‌ మాట్లాడుతూ “1976లో గెజిట్‌ విడుదల చేయకుండానే లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల అసలు ఆదివాసీలకు చెందాల్సిన రిజర్వేషన్లు, హక్కులు వారికి దక్కడం లేదు” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెల 24న ఉట్నూరు, డిసెంబర్‌ 15న మన్ననూరు, డిసెంబర్‌ 29న భద్రాచలం ఐటీడీఏ కార్యాలయాల వద్ద కూడా భారీ ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఎమ్మెల్యేల ఇళ్ళ ముట్టడి, వంటావార్పు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793