బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణపై చిరు వ్యాపారుల వేదన ఎంఎల్‌ఏ గడ్డం వినోద్‌కి విన్నపం
బెల్లంపల్లి, నవంబర్ 3 : బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల కారణంగా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి విన్నపం చేశారు.
సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి కాంట్రా వరకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మున్సిపాలిటీ అధికారులు పోలీసు బలంతో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, గుడిసెలు, వ్యాపార స్థలాలను కోర్టు స్టే వున్నా కూల్చివేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
“మేము రోడ్ల పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొని మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. కానీ ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా మా వ్యాపారాలను కూల్చివేశారు. దీనివల్ల మేము ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాం,” అని వ్యాపారులు పేర్కొన్నారు.
బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే లేకపోవడంతో తమ సమస్యను ఎవరికి చెప్పాలో తెలియక తీవ్ర నిరాశలో ఉన్నామని వారు తెలిపారు. “మేము మిమ్మల్ని గెలిపించాం, ఇప్పుడు మీరు మా సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలి. నష్టపోయిన వ్యాపారులకు పునరావాసం కల్పించి, తగిన సాయం చేయాలని మా విన్నపం,” అని బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు మొహమ్మద్ గౌస్ తెలిపారు.
రోడ్డు విస్తరణతో పట్టణ అభివృద్ధి జరుగుతుందనే విషయం వ్యాపారులు అంగీకరిస్తూనే, అభివృద్ధి పేరుతో ప్రజల జీవనోపాధి దెబ్బతినకూడదని, ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.

Post a Comment