తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ సేవల విప్లవానికి నూతన అధ్యాయం
హైదరాబాద్: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మీ-సేవా (MeeSeva) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే కేవలం ఒక మెసేజ్‌తోనే సేవలు లభించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత.
ప్రస్తుతం రాష్ట్రంలోని 38 ప్రభుత్వ శాఖలకు చెందిన 580కు పైగా సేవలు ఈ కొత్త డిజిటల్ వ్యవస్థలో సమీకరించబడ్డాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవలను వాట్సాప్‌లో సమగ్రంగా అందుబాటులోకి తెచ్చిన అతి పెద్ద డిజిటల్ ఇంటిగ్రేషన్ ఇదేనని అధికారులు తెలిపారు.
ఈ సేవల ద్వారా పౌరులు సులభంగా పొందగల ముఖ్యమైన సర్టిఫికెట్లు, చెల్లింపులు:
✔️ ఇన్‌కం సర్టిఫికేట్
✔️ బర్త్ సర్టిఫికేట్
✔️ కాస్ట్ సర్టిఫికేట్
✔️ డెత్ సర్టిఫికేట్
✔️ విద్యుత్ బిల్లు చెల్లింపు
✔️ నీటి బిల్లులు
✔️ ఆస్తిపన్నులు
సేవలను ఎలా పొందాలి?
ప్రజలు వాట్సాప్ నంబర్ 80969 58096 కు ‘Hi’ అని పంపితే వెంటనే మెను ప్రత్యక్షమవుతుంది. అందులో అవసరమైన సేవను ఎంచుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ వేగవంతం, పారదర్శకతతో ఉండగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఉపయుక్తమని అధికారులు చెప్పారు. ఎక్కడ ఉన్నా, ఎప్పుడు కావాలన్నా ప్రభుత్వ సేవలు తక్షణం అందుబాటులోకి రావడం ఈ వ్యవస్థ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Post a Comment