-->

నేను ఇన్‌చార్జి కలెక్టర్‌గా వచ్చా.. విధుల్లో చేర్చుకోండి” అని కలెక్టరేట్‌లో కలకలం

నేను ఇన్‌చార్జి కలెక్టర్‌గా వచ్చా.. విధుల్లో చేర్చుకోండి” అని కలెక్టరేట్‌లో కలకలం
కామారెడ్డిలో నకిలీ ఐఏఎస్ హంగామా

కామారెడ్డి : నవంబర్‌ 6: కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం నాడు ఊహించని ఘటన చోటుచేసుకుంది. “నేను ఐఏఎస్‌ ఆఫీసర్‌ని.. ఇక్కడికి ఇన్‌చార్జి కలెక్టర్‌గా వచ్చా.. వెంటనే విధుల్లో చేర్చుకోండి” అంటూ ఓ మహిళ కలెక్టరేట్‌లో హంగామా సృష్టించింది.

వివరాల్లోకి వెళ్తే, జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఈ నెల 2నుంచి సెలవులో ఉండగా, ఆయన స్థానంలో నిజామాబాద్‌ కలెక్టర్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఈ నేపధ్యంలో, హైదరాబాద్‌ జీడిమెట్లకు చెందిన ఇస్రత్‌ జహన్‌ అనే మహిళ మంగళవారం (నవంబర్‌ 4న) తన కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకుంది.

నేరుగా కలెక్టర్‌ చాంబర్‌లోకి వెళ్లిన ఆమె.. “సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం నన్ను ఇన్‌చార్జి కలెక్టర్‌గా నియమించింది” అంటూ ఉత్తర్వులు చూపించింది. ఆమె చూపిన పత్రాలను అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ పరిశీలించి, “ఇవి ప్రభుత్వ స్థాయి నిర్ధారణ అవసరం ఉన్న పత్రాలు, సమీక్ష అనంతరం నిర్ణయం చెబుతాం” అన్నారు.

ఇంతలో ఆ మహిళ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అధికారులకు అనుమానం కలిగింది. వెంటనే ఏడీసీ పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దేవునిపల్లి పోలీసులు ఆ మహిళను తూప్రాన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

తదుపరి విచారణలో, ఇస్రత్‌ జహన్‌ 2020 నుంచి గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు, తనకు ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులకు నమ్మబలికేందుకే ఈ నాటకానికి పాల్పడినట్లు తెలిపింది.

పోలీసులు నకిలీ నియామక ఉత్తర్వులను స్వాధీనం చేసుకొని, ఆమెపై చీటింగ్‌, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793