హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
కొత్తగూడెం లీగల్ :: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు.
వివరాల్లోకి వెళితే — మణుగూరు మండలం పి.వి. కాలనీకి చెందిన సూరపాక శివకృష్ణ 2021 ఫిబ్రవరి 6న తన తండ్రి సూరపాక రామనాథం (60) హత్యకు గురయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, అదే కాలనీకి చెందిన చెవుల సురేష్ “నిన్న కొన్న మద్యం ఉంది, వెళ్లి తాగుదాం” అంటూ రామనాథాన్ని పల్సర్ బైక్ పై రేగులచెరువు వద్దకు తీసుకెళ్లాడు. ఇద్దరూ మద్యం సేవించిన తర్వాత సురేష్ కర్రతో రామనాథంపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం రామనాథం వద్ద ఉన్న రూ.4,000 నగదు, పల్సర్ బైక్ దోచుకొని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై రామనాథం కుమారుడు శివకృష్ణ మణుగూరు ఇన్స్పెక్టర్ ఆర్.భాను ప్రకాష్‌కు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నిందితుడు చెవుల సురేష్‌పై చార్జ్ షీట్ దాఖలు చేశారు.
కోర్టు మొత్తం 11 మంది సాక్షులను విచారించింది. అందిన ఆధారాల ఆధారంగా న్యాయమూర్తి నిందితుడు చెవుల సురేష్ నేరం నిరూపితమైందని తేల్చి, జీవిత ఖైదు మరియు రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు.
ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్.ఐ. డి. రాఘవయ్య, కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పి.సి.ఎం. అశోక్ సహకారం అందించారు.

Post a Comment