గర్భంలోనే ఇద్దరు కవలలను కోల్పోయి… భార్య మృతి దెబ్బ తట్టుకోలేక భర్త ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్‌జిఐఎ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తిన దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భంలో ఉన్న ఇద్దరు కవలలు, భార్యను కోల్పోయిన బాధను తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఆర్‌జిఐఎ ఇన్‌స్పెక్టర్ బాల్‌రాజ్ మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు.
బెంగుళూరు వ్యక్తి శంషాబాద్‌లో అద్దెకు నివాసం
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు నగరానికి చెందిన ముత్యాల విజయ్ (40) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఇటీవల శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లేవ్ కాలనీలో అద్దెకు నివసిస్తున్నాడు. అతని భార్య శ్రావ్య ఎనిమిది నెలల గర్భిణి.
బట్టర్ ఫ్లై హాస్పిటల్‌లో చెకప్… కవలల పరిస్థితి విషమం
గర్భం చివరి దశలో ఉన్న శ్రావ్యను రొటీన్ చెకప్ కోసం విజయ్, ఆమె తల్లితో కలిసి అత్తాపూర్‌లోని బట్టర్ ఫ్లై హాస్పిటల్‌కు తీసుకువెళ్లాడు. పరిశీలించిన డాక్టర్లు ఆమె గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నట్లు, కానీ వారి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపారు. మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఉందని సూచించారు.
మైత్రి నుంచి సరోజినీ హాస్పిటల్ వరకు ప్రాణపోరాటం
దీంతో కుటుంబ సభ్యులు శ్రావ్యను వెంటనే గుడిమల్కాపూర్‌లోని మైత్రి హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ కూడా పరిస్థితి నిలకడగా లేకపోవడంతో ఆమెను హుటాహుటిన సరోజినీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. గర్భంలోని రెండు కవల పిల్లలతో పాటు శ్రావ్య కూడా మృతి చెందింది.
ఈ దారుణ విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది శ్రావ్య తల్లికి తెలిపారు. ఆమె ఆ వేదనతో వెంటనే అల్లుడు విజయ్‌కు ఫోన్ చేసి తెలియజేశారు.
భార్య, బిడ్డల మృతిచెప్పడంతో మనస్తాపం… చివరకు ఉరితాడు
విజయ్ ఈ వార్త విని తీవ్ర షాక్‌కు గురయ్యాడు. మానసికంగా మునిగిపోయి వెంటనే శంషాబాద్‌లోని తన గదికి వెళ్లిపోయాడు. కొన్ని గంటల పాటు ఫోన్‌కి స్పందించకపోవడంతో అతని మేనమామ అనుమానం వచ్చి అతని నివాసానికి చేరుకున్నాడు. గదిలోకి వెళ్లి చూడగా విజయ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
అన్నయ్యకు ఫోన్… కుటుంబం శోకసంద్రం
వెంటనే ఈ విషయం విజయ్ అన్న ప్రవీణ్‌కు తెలియజేశారు. అతడు అక్కడికి చేరుకుని తమ్ముడిని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ఒక్కసారిగా భార్య, బిడ్డలు, భర్తను కోల్పోయిన కుటుంబం శోకమునిగిపోయింది.
పోలీసు కేసు నమోదు
సమాచారం అందుకున్న ఆర్‌జిఐఎ పోలీసులు అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించారు. విజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Post a Comment