చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశం – బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో చోటుచేసుకున్న ఆర్టీసీ బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రమాదంలో మరణించిన 19 మందిలో ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
- మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి,
- రూ.2 లక్షలు ఆర్టీసీ తరపున,మొత్తం రూ.7 లక్షల పరిహారం అందజేయనున్నారు. అలాగే గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషాద ఘటనపై స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, పీఎంఎన్ఆర్‌ఎఫ్ (Prime Minister’s National Relief Fund) ద్వారా
- మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున,
- గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని చెప్పారు. ప్రతి మృతదేహాన్ని వారి స్వస్థలాలకు సురక్షితంగా తరలించేందుకు ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించినట్లు వివరించారు.
అలాగే, ప్రమాదం తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఈ ఘటనపై ప్రత్యేక విచారణ కమిటీని నియమించి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను ఈ విషాద ఘటనను రాజకీయ కోణంలో చూడవద్దని కోరుతూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Post a Comment