ఐ బొమ్మ ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవి అరెస్టు
హైదరాబాద్ : నవంబర్ 16: సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్న ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐ బొమ్మ’ అడ్మిన్ ఇమ్మడి రవి చివరకు సైబర్ క్రైమ్ బృందం బారిన పడ్డాడు. మూడు నెలల నుంచి సాగిన వ్యూహాత్మక ఆపరేషన్‌లో భాగంగా శనివారం అతడిని కూకట్‌పల్లిలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రవి పేరుతో ఉన్న మూడు బ్యాంకు ఖాతాల్లోని రూ.3 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు.
ఇటీవల విడుదలైన సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్న సమయానికే రికార్డ్ చేసి, కొన్ని నిమిషాల్లోనే ‘ఐ బొమ్మ’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా భారీ స్థాయిలో పైరసీ జరిపినట్లు దర్యాప్తులో తేలింది. పైరసీ కారణంగా 2023లో భారత సినీ పరిశ్రమకు రూ.22,400 కోట్ల నష్టం, అలాగే 2024లో తెలుగు సినీ పరిశ్రమకే రూ.3,700 కోట్ల నష్టం జరిగిందని యాంటీ పైరసీ టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో పైరసీ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, భారీ సంఖ్యలో పైరేటెడ్ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అశ్వినీ కుమార్ సహా పలువురు ఇచ్చిన సమాచారంతో ఇమ్మడి రవి గురించి కీలక వివరాలు లభించాయి.
కొంతకాలంగా రవి కరీబియన్ దీవుల్లో ఉండి రిమోట్‌గా ‘ఐ బొమ్మ’ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఇటీవల అతడు ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం రావడంతో అతడి కదలికలపై నిఘా పెంచి, కూకట్‌పల్లిలోని ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
దర్యాప్తులో భాగంగా రవి వేలాది సినిమాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడైంది. హైఎండ్ టెక్నాలజీతో థియేటర్ డీసీఐ సర్వర్లను హ్యాక్ చేయడం, హార్డ్‌డిస్కుల్లో ఉన్న కంటెంట్‌ను దొంగిలించడం, సినిమా ప్రసార సంస్థల మెయిల్ సర్వర్లను బ్రీచ్ చేయడం వంటి పద్ధతులతో పైరసీ జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకోసం రవి హ్యాకర్లకు లక్షల రూపాయలు చెల్లించినట్టు సమాచారం.
‘మమ్మల్ని ఆపలేరు… వెతకలేరు’ అంటూ గతంలో పోలీసులకు సవాల్ చేసిన ఇమ్మడి రవిని, సైబర్ క్రైమ్ అధికారులు వ్యూహాత్మకంగా పట్టుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. రవి ఇచ్చిన సమాచారంతో ముఠాలో ఉన్న మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో మరికొన్ని అరెస్టులు జరగనున్నట్టు సైబర్ క్రైమ్ వర్గాలు తెలిపాయి..

Post a Comment