-->

రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం

రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం


హైదరాబాద్ : నవంబర్ 16: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు (నవంబర్ 17) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి అమలును నిలిపివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు కూడా అనుకూల ఫలితం రాలేదు. దీంతో రేపటి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తుది దిశానిర్దేశం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

కులగణన ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించినప్పటికీ, కేంద్రం దీనికి సంబంధించిన బీసీ బిల్లులకు ఆమోదం తెలపకపోవడం, పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసి రిజర్వేషన్లను 50% వరకు పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం వంటి అంశాలు ప్రభుత్వాన్ని ఇబ్బందిలోకి నెట్టాయి. ఇదే సమయంలో హైకోర్టు మాత్రం 50% రిజర్వేషన్లను మించకుండా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే స్పష్టం చేసింది.

హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నట్లులేదని ఎన్నికల సంఘంపై పిటిషన్ దాఖలవడంతో కేసు ఈ నెల 24కి వాయిదా పడింది. ఆ తేదీన పంచాయతీ ఎన్నికలపై కీలక విచారణ జరుగనుంది. గత విచారణలో ప్రభుత్వ అభ్యర్థన మేరకు కోర్టు కొంత సమయం ఇచ్చిన నేపథ్యంలో—ఈసారి ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తప్పనిసరిగా స్పష్టమైన సమాధానం సమర్పించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో రేపటి కేబినెట్ సమావేశం అత్యంత కీలకమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు, ఎలాంటి రిజర్వేషన్ విధానంతో నిర్వహించాలనే ప్రశ్నలకు సమాధానాలు ఈ భేటీ నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793