-->

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు..! పెళ్లి పేరిట యువకులకు టోకరా

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు..! పెళ్లి పేరిట యువకులకు టోకరా


శ్రీకాకుళం (ఇచ్చాపురం): శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం కర్జీ వీధికి చెందిన ముత్తిరెడ్డి వాణి (19) వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. నిత్యం పెళ్లి కూతురుగా మారుతూ, పెళ్లి కాని యువకులను నమ్మించి మోసం చేస్తోందన్న ఆరోపణలతో ఆమె వార్తల్లో నిలిచింది.

తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరిట వరులను మభ్యపెట్టి, ఎదురు కట్నం, బట్టలు, ఇతర ఖర్చుల కోసం నగదు తీసుకుని వివాహం చేసుకుంటోంది. అయితే పెళ్లైన వారం రోజుల్లోనే చెప్పాపెట్టకుండా పరారవడం ఆమెకు అలవాటుగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని ఇలా మోసం చేసినట్టు సమాచారం.

ఇటీవల సోంపేటలోని దుర్గాదేవి ఆలయంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడిని వివాహం చేసుకున్న వాణి, అతనితో కలిసి స్వగ్రామానికి వెళ్తూ పలాస నుంచి రైలులో ప్రయాణించింది. విజయనగరం రైల్వే స్టేషన్‌లో బాత్రూం‌కు వెళ్తానని చెప్పి ట్రైన్ నుంచి దిగిపోయి అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. వరుడు, అతని కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికితే ఇచ్చాపురంలోని మేనత్త ఇంటికి చేరుకున్నట్టు తెలిసింది.

ఈ వివాహం కోసం వరుడు తరఫు వారు లక్ష రూపాయల ఎదురు కట్నంతో పాటు బట్టలు, ఇతర ఖర్చుల కోసం డబ్బులు అందజేశారు. డబ్బులన్నీ తీసుకుని వాణి పరారైనట్టు బాధితులు చెబుతున్నారు. విషయం బయటపడిన తర్వాత మేనత్త సంధ్య డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నట్టు సమాచారం.

ఈ ఘటనపై వాణి చేత మోసపోయిన నాగిరెడ్డి, కేశవరెడ్డి గురువారం ఇచ్చాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఆమె చేసిన ఎనిమిది పెళ్లిళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆధారాలుగా పోలీసులకు అందజేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వాణి తల్లి చిన్నప్పుడే మృతి చెందగా, తండ్రి నిర్లక్ష్యంతో మేనత్త సంధ్య ఆమెను పెంచినట్టు సమాచారం. మైనర్‌గా ఉన్న సమయంలో జరిగిన ఘటనలు వెలుగులోకి రాకపోయినా, ప్రస్తుతం ఆమె 19 ఏళ్లు కావడంతో గత వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793