సీతక్క పట్టుదలతో మేడారానికి కొత్త రూపం
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంగణం అద్భుతంగా పునర్నిర్మాణం అవుతోంది. ఆదివాసీల సంస్కృతి, కొయ్య దొరల వారసత్వాన్ని భావితరాలకు అందించేలా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. స్వయంగా అడవి బిడ్డ అయిన మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు ప్రతిరోజూ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తూ, వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
శరవేగంగా పునర్నిర్మాణ పనులు
మేడారం అభివృద్ధిలో భాగంగా సుమారు 4,000 టన్నులకు పైగా కృష్ణశిలను వినియోగిస్తున్నారు. గద్దెల ప్రాంగణాన్ని 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 46 భారీ స్తంభాలతో నిర్మిస్తున్నారు. భక్తుల దర్శనానికి ముఖ్యమైన గద్దె చుట్టూ 8 ప్రత్యేక స్తంభాలు, గద్దెల మధ్యలో వెదురు ఆకృతులు ఏర్పాటు చేసి, ఆదివాసీ సంప్రదాయం ఉట్టిపడేలా డిజైన్ చేస్తున్నారు.
ఈ ప్రాంగణంలో మొత్తం 7,000 శిల్పాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి కొయ్య తెగ సంస్కృతి, వారి వంశావళి, జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రాకార గోడలపై కొయ్యల చరిత్రను తెలిపే చిహ్నాలు చెక్కుతుండగా, ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద సమ్మక్క వంశానికి చెందిన 59 శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ శిల్పాల ద్వారా సుమారు 750 కొయ్య వంశాల గుర్తింపు నిలిచిపోనుంది.
భారీ తోరణాలతో ప్రత్యేక శోభ
ఆలయ ప్రాంగణాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు భారీ తోరణాలు నిర్మిస్తున్నారు. ఇందులో
- 50 అడుగుల ఎత్తు గల ఒక ప్రధాన తోరణం,
- 40 అడుగుల ఎత్తు గల మూడు తోరణాలు,
- 30 అడుగుల ఎత్తు గల ఐదు తోరణాలుప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ తోరణాలు కాకతీయ–ఆదివాసీ నిర్మాణ శైలుల సమ్మేళనంగా భక్తులను ఆకట్టుకోనున్నాయి.
ప్రాచీనతకు భంగం లేకుండా అభివృద్ధి
ఈ మహత్తర నిర్మాణాన్ని డాక్టర్ హరిప్రసాద్ నేతృత్వంలో 250 మంది నిపుణ శిల్పులు చెక్కుతున్నారు. ప్రముఖ పురావస్తు నిపుణులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతీలాల్ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. రూపకల్పన, డాక్యుమెంటేషన్‌లో 15 మంది ఆర్కియాలజీ విద్యార్థులు పాల్గొంటూ ప్రాచీనత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అభివృద్ధి పేరుతో ప్రకృతిని విస్మరించకుండా, ప్రాంగణంలోని పాత చెట్లను యథాతథంగా సంరక్షిస్తున్నారు. అదనంగా 12 రకాల పవిత్ర అటవీ వృక్షాలు, 140 రకాల ఔషధ మొక్కలు నాటి పవిత్ర వనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అడవి తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది.
ప్రపంచ స్థాయి గుర్తింపు దిశగా మేడారం
ఈ పునర్నిర్మాణ పనులు పూర్తయితే, మేడారం కేవలం జాతర ప్రదేశంగా కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఆదివాసీ సాంస్కృతిక కేంద్రం’గా గుర్తింపు పొందుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

Post a Comment