ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై నేడు స్పీకర్ తీర్పు!
హైదరాబాద్, డిసెంబర్ 17: బిఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కీలక తీర్పు వెలువడనుంది. పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు వెల్లడించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేల న్యాయవాదులకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి — ఈ ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బిఆర్ఎస్ పార్టీ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై స్పీకర్ నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు అనంతరం అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న బిఆర్ఎస్, సంబంధిత ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు స్పీకర్ మొదట దశలో ఐదుగురు ఎమ్మెల్యేలకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.
ఇప్పుడు ఆ ప్రక్రియ ముగియడంతో, నేటి తీర్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Post a Comment