-->

భర్తను హత్య చేసి… స్నానం చేసి స్కూల్‌కు వెళ్లింది!

భర్తను హత్య చేసి… స్నానం చేసి స్కూల్‌కు వెళ్లింది! నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ టీచర్ ఘాతుకం – స్కూల్‌లోనే మొదలైన నాటకం


నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో చోటుచేసుకున్న ఈ భయంకర ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలే తన భర్తను హత్య చేసి, ఏమీ తెలియనట్లుగా స్కూల్‌కు వెళ్లి విధులు నిర్వర్తించడం అందరినీ విస్మయానికి గురి చేసింది.

ప్రేమ వ్యవహారం… వివాహేతర సంబంధం

అచ్చంపేట పట్టణంలోని మారుతీ కాలనీకి చెందిన లక్ష్మణ్ నాయక్ (38), పద్మ (30) దంపతులు. పద్మ సమీపంలోని పట్టుగడిపల్లి తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఇదే క్రమంలో తడూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోపి (40)తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. గోపికి కూడా ఇప్పటికే వివాహమై ఉండటంతో విషయం మరింత తీవ్రంగా మారింది. ఈ వ్యవహారం భర్త లక్ష్మణ్ నాయక్‌కు తెలిసిపోవడంతో, అతడు పద్మను హెచ్చరించాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

హత్యకు పథకం

భర్త తమ సంబంధానికి అడ్డుగా మారుతున్నాడని భావించిన పద్మ, అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తన ప్రియుడు గోపికి చెప్పగా, అతడూ అందుకు అంగీకరించాడు.

గత నెల 24వ తేదీ రాత్రి లక్ష్మణ్ నాయక్ నిద్రపోతున్న సమయంలో పద్మ గోపిని ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి నిద్రలో ఉన్న లక్ష్మణ్ నాయక్ ముఖంపై దుప్పటిని అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం గోపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

స్కూల్‌లో మొదలైన డ్రామా

హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం పద్మ ఏమీ జరగనట్లుగా స్నానం చేసి, చక్కగా రెడీ అయి స్కూల్‌కు వెళ్లింది. అక్కడి నుంచే ఆమె ఇంటి యజమానికి ఫోన్ చేసి,

“మా ఆయనకు ఒంట్లో బాలేదు. నేను స్కూల్‌కు వచ్చేశాను. ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ఒకసారి ఇంటికి వెళ్లి చూసి చెప్పండి”
అంటూ ఏడుస్తూ నటించింది.

ఇంటి యజమాని వెళ్లేలోపే, పద్మ స్కూల్‌లోనే తన భర్త చనిపోయాడంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె నటనను నమ్మిన తోటి ఉపాధ్యాయులు ఆమెను ఓదార్చారు.

అనుమానం… నిజం బయటపడింది

అయితే లక్ష్మణ్ నాయక్ తమ్ముడికి పద్మ ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పద్మను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ప్రియుడి కోసం భర్తను హత్య చేసినట్లు పద్మ అంగీకరించింది.

పోలీసులు పద్మతో పాటు గోపిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సమాజంలో కలకలం

సమాజానికి విలువలు, బుద్ధి చెప్పాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నైతిక విలువల పతనానికి నిదర్శనంగా నిలిచిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793