-->

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి

గ్రేటర్ పరిధిలోని అర్బన్ మండలాల్లో అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలి ఐ అండ్ పిఆర్ కమిషనర్‌కు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వినతి


హైదరాబాద్, డిసెంబర్ 29: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా జీఓలో తగిన సవరణలు చేపట్టాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) బృందం సమాచార & ప్రజాసంబంధాల శాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు సోమవారం సచివాలయంలోని ఐ అండ్ పిఆర్ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ప్రియాంకను టీయూడబ్ల్యూజే ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కే. శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, హెచ్‌యూజే అధ్యక్షులు శిగా శంకర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సలీం పాషా, మేడ్చల్ జిల్లా కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణలు పాల్గొన్నారు.

గ్రేటర్ పరిధిలోని అర్బన్ మండలాల్లో ప్రధాన పత్రికల తరఫున ఒక్కో మండలంలో నలుగురు నుంచి ఐదుగురు జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇటీవల జారీ చేసిన నూతన జీఓ–252 ప్రకారం ఒక్కో పత్రికకు ఒక్క మండలానికి కేవలం ఒక అక్రిడిటేషన్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉండటంతో మిగతా జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

రూరల్ మండలాల ప్రమాణాలతో కాకుండా అర్బన్ మండలాలను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని జీఓలో తగిన సవరణలు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సానుకూలంగా స్పందించిన కమిషనర్

గ్రేటర్ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యపై ఐ అండ్ పిఆర్ కమిషనర్ ప్రియాంక సానుకూలంగా స్పందించారు. అర్బన్ మండలాల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇవ్వడం న్యాయబద్ధమేనని పేర్కొన్నారు. ఈ అంశంపై త్వరలోనే సంబంధిత మంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793