-->

కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసిన ముఖ్యమంత్రి – శాసనసభలో రాజకీయ సౌహార్దానికి నిదర్శనం


హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏడవ సమావేశాలు సోమవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి మంత్రులు, విప్‌లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి మరియు శాసనసభ కార్యదర్శులు ఘన స్వాగతం పలికారు.

సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి స్థానం వద్దకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును (కేసీఆర్) మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ దృశ్యం సభలో రాజకీయ సౌహార్దానికి ప్రతీకగా నిలిచింది.

శాసనసభ తొలి రోజు సందర్భంగా ఇటీవల దివంగతులైన మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి (సూర్యాపేట), కొండా లక్ష్మారెడ్డి (చేవెళ్ల) లకు శాసనసభ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టి ఘన నివాళులు అర్పించింది.

అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జీరో అవర్‌ను చేపట్టారు. సంతాప తీర్మానాల తర్వాత కేసీఆర్ సభ నుంచి నిష్క్రమించారు. తదుపరి సభా కార్యక్రమాలను జనవరి 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793