కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం ప్రజల్లో తీవ్ర భయందోళన
కామారెడ్డి | డిసెంబర్ 03: కామారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత ప్రత్యక్షం కావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యాపించింది. కామారెడ్డిని ఎల్లారెడ్డితో కలిపే ప్రధాన రహదారి వద్ద, కొట్టాల్ గ్రామ శివారులో మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం—కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులు అడవి అంచున సంచరిస్తున్న చిరుతను గమనించారు. అకస్మాత్తుగా కనిపించిన చిరుతను చూసి ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో, ఆ జంతువు వెంటనే పొదల్లోకి పారిపోయింది.
ఈ ఘటనతో కొట్టాల్ గ్రామం సహా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారి పక్కనే చిరుత కనబడటం వల్ల ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
చిరుత సంచారం విషయంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికుల భద్రత కోసం అధికారులు ప్రాంతంలో గస్తీ పెంచి, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామస్తులకు రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణం చేయకూడదని సూచనలు జారీ చేశారు.

Post a Comment