అనుమానమే కారణం భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త హత్య
హైదరాబాద్ నల్లకుంటలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యపై అనుమానంతో భర్త అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. పిల్లల కళ్లముందే భార్యపై దాడి చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త అమానుషంగా ప్రవర్తించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురిని సైతం మంటల్లోకి తోసేయడం ఈ ఘటన తీవ్రతను మరింత పెంచింది.
ఈ ఘటనలో నల్గొండ జిల్లా హుజురాబాద్‌కు చెందిన వెంకటేష్, త్రివేణిలు బాధితులు. ప్రేమించి వివాహం చేసుకున్న వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కొంతకాలంగా భర్త వెంకటేష్‌కు భార్య త్రివేణిపై అనుమానం పెరిగి, తరచూ వేధింపులు, గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
భర్త వేధింపులు తట్టుకోలేక ఇటీవల త్రివేణి తన అమ్మవారి ఇంటికి వెళ్లింది. అనంతరం “మారుతాను” అంటూ ఆమెను ఒప్పించి తిరిగి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన వెంకటేష్, వచ్చిన కొద్ది రోజులకే ఈ ఘోరానికి పాల్పడ్డాడు.
ఇంట్లో జరిగిన ఘర్షణ క్రమంలో త్రివేణిపై దాడి చేసిన వెంకటేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అరిచే శబ్దాలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, తల్లి–కూతురిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే త్రివేణి మృతి చెందగా, కూతురు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య అనంతరం పరారైన వెంకటేష్‌ను పోలీసులు 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన మరోసారి కుటుంబ హింస, అనుమానాల వల్ల జరిగే నేరాలపై తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Post a Comment