-->

కాంగ్రెస్ సీనియర్ నేత ఎడమకంటి రోసిరెడ్డి కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత ఎడమకంటి రోసిరెడ్డి కన్నుమూత నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు


భద్రాచలం నియోజకవర్గం, బూర్గంపాడు మండల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎడమకంటి రోసిరెడ్డి (62) గురువారం రాత్రి కన్నుమూశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం విశాఖపట్నం వెళ్లిన ఆయనకు అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

గురువారం రాత్రి విశాఖపట్నంలో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురైన రోసిరెడ్డిని వెంట ఉన్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు తక్షణమే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ వార్త వెలువడగానే సారపాకతో పాటు బూర్గంపాడు మండలం, భద్రాచలం నియోజకవర్గం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఎడమకంటి రోసిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమించడమే కాకుండా, స్థానిక సమస్యలపై పోరాడే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. సామాన్య ప్రజలతో సన్నిహితంగా మెలిగి, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండేవారని పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.

ఆయన అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. రోసిరెడ్డి మృతిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రోసిరెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, అంత్యక్రియలు కుటుంబ నిర్ణయం మేరకు జరగనున్నట్లు సమాచారం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793