💥 యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు దేవతలను దూషించాడంటూ హిందూ సంఘాల ఆగ్రహం
హైదరాబాద్ | డిసెంబర్ 31: హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ **అన్వేష్ (నా అన్వేషణ)**పై తెలంగాణలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అన్వేష్‌ను దేశద్రోహిగా ప్రకటించి, విదేశాల్లో ఉంటే భారత్‌కు రప్పించి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇదే కేసులో ఇప్పటికే ఖమ్మంలోనూ కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఖమ్మంలోనూ కేసు
హిందూ దేవతలైన సీతాదేవి, ద్రౌపదిలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని ఆరోపణలపై, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదైంది. దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్య నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో ఆగ్రహం
ద్రౌపదిని ఉద్దేశించి “RAPE” అనే పదంతో పోస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని హిందూ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అంతకుముందు విశాఖపట్నంలో కూడా అన్వేష్‌పై ఫిర్యాదు నమోదైనట్లు సమాచారం.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
అన్వేష్ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆయనపై దేశద్రోహం సహా కఠిన సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
- .

Post a Comment