దారులన్నీ వనదేవతల చెంతకే – కొలాహలంగా మారిన మేడారం
భక్తజన సంద్రంతో మేడారం అరణ్య ప్రాంతం కిటకిటలాడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర బుధవారం నుంచి ప్రారంభమై నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే భక్తుల రాకతో మేడారం పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి.
బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు మేడారానికి చేరుకోనుండగా, వారి ఆగమనంతో మహాజాతరకు అధికారికంగా తెరలేవనుంది. అనంతరం గురువారం రోజున సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరనుండగా, వనదేవతల సమక్షంలో నిండు జాతర ఆవిష్కృతం కానుంది.
ఈ మహాజాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తులు సంప్రదాయబద్ధంగా జంపన్నవాగులో స్నానాలు ఆచరించి, వనదేవతలకు తమ మొక్కులను చెల్లిస్తూ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు.
మేడారం మహాజాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎలాంటి అంతరాయం లేకుండా జాతర నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఆలయ అభివృద్ధి, రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రూ.251 కోట్ల నిధులను వెచ్చించింది.
జాతర నిర్వహణ కోసం మొత్తం 21 ప్రభుత్వ శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం పోలీస్, వైద్య, ఆర్టీసీ, అగ్నిమాపక, విద్యుత్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
అటవీ ప్రాంతమంతా భక్తుల జయజయధ్వానాలతో మార్మోగుతుండగా, వనదేవతల ఆశీస్సుల కోసం దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో మేడారం మరోసారి ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది.

Post a Comment