మేడారం ఒడిలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు
ములుగు జిల్లా, జనవరి 27: ఆసియాలోనే అతిపెద్ద వనదేవతల గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు మేడారం అటవీ ప్రాంతం ముస్తాబైంది. కోట్లాదిమంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలివస్తుండటంతో జాతర పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల ముప్పు పెరుగుతోంది.
జాతర ముగిసిన తర్వాత మిగిలిపోయే ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు అటవీ ప్రాంతంలో పేరుకుపోయి పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇది భూగర్భ జలాలకు మాత్రమే కాకుండా అటవీ జీవజాలానికి కూడా పెద్ద ముప్పుగా మారుతోంది. ఈ పరిస్థితి అధికారులకు పెద్ద సవాలుగా నిలుస్తోంది.
ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. జాతర ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. జాతర ప్రాంతంలో వ్యాపారులు తప్పనిసరిగా పర్యావరణ అనుకూల పదార్థాలనే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది.
భక్తులు క్లాత్ బ్యాగులు, స్టీల్ గ్లాసులు, ఆకులతో చేసిన ప్లేట్లు వాడాలని అవగాహన కల్పిస్తున్నారు. అలాగే జాతర ప్రాంగణం అంతటా ప్రత్యేక చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, వ్యర్థాలను వేర్వేరు విభాగాలుగా వర్గీకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
పారిశుధ్య కార్మికులు, వాలంటీర్లతో కలిసి రోజువారీగా చెత్త తొలగింపు చేపట్టేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో భక్తులు సహకరించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం మేడారంలో విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 5,500 తాత్కాలిక నీటి కుళాయిలు, 517 బ్యాటరీ కుళాయిలు, 47 సిస్టర్న్లు, 312 సిస్టర్న్ కుళాయిలు, 10 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.
అలాగే 285 టాయిలెట్ బ్లాక్‌లలో 5,700 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా మూడు షిఫ్టులలో 5,000 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. మేడారం ప్రాంతాన్ని 25 పారిశుధ్య విభాగాలుగా విభజించి, రంగాల వారీగా 526 మంది పర్యవేక్షకులను నియమించారు.
వ్యర్థాల తొలగింపుకు 100 ట్రాక్టర్లు, దుమ్ము అణచివేతకు 150 నీటి ట్యాంకర్లు, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లు, 18 స్వీపింగ్ మిషన్లు, 12 జేసీబీలు వినియోగిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది.

Post a Comment