తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. నేడు నోటిఫికేషన్ విడుదలకు అవకాశం
హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇవాళ సాయంత్రానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఉదయం జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించనుంది.
ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు పోలింగ్ జరగనుంది. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరిగే అవకాశముంది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని ఫిబ్రవరి 15లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి రానుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. ఓటర్ల తుది జాబితాలు సిద్ధంగా ఉండగా, పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ఉత్సాహం నెలకొనగా, అభ్యర్థుల ఎంపిక, వ్యూహాలపై చర్చలు ముమ్మరమయ్యాయి. అధికారిక షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెరిగే అవకాశముంది.

Post a Comment