కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ సమీపానికి అమెరికా యుద్ధ నౌకలు
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత | పూర్తిస్థాయి యుద్ధమేనని ఇరాన్ హెచ్చరిక
జనవరి 25: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ భయం నెలకొంది. ఇరాన్ సమీపానికి అమెరికా భారీ యుద్ధ నౌకాదళాన్ని తరలిస్తుండటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. ఈ పరిణామాలపై ఇరాన్ ఘాటుగా స్పందిస్తూ, తమపై ఎలాంటి దాడి జరిగినా దానిని పూర్తిస్థాయి యుద్ధంగానే పరిగణిస్తామని హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు. “భారీ సంఖ్యలో అమెరికా యుద్ధ నౌకలు ఆ ప్రాంతం వైపు కదులుతున్నాయి. ఏమీ జరగకూడదన్న ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
ఆసియా–పసిఫిక్ ప్రాంతం నుంచి యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక నేతృత్వంలోని నౌకాదళం మధ్యప్రాచ్యం వైపు కదులుతోంది. ఇందులో యూఎస్ఎస్ మెక్‌ఫాల్, యూఎస్ఎస్ మిట్‌స్చెర్ డిస్ట్రాయర్లు, మరో మూడు యుద్ధ నౌకలు, ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్లు ఉన్నాయి.
ఇరాన్‌లో ఇటీవల జరిగిన నిరసనలపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడమే అమెరికా తాజా చర్యలకు కారణమని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాల భద్రత కోసం పాట్రియాట్, థాడ్ (THAAD) వంటి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను కూడా మోహరిస్తోంది.
రాబోయే కొద్ది రోజుల్లో అమెరికా నౌకాదళం మధ్యప్రాచ్యానికి చేరుకునే అవకాశముండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Post a Comment