మీడియా అక్రిడిటేషన్ నిబంధనల్లో విస్తృత సవరణలు
హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ ప్రభుత్వం మీడియా రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025లో పలు ముఖ్యమైన సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇవాళ జీవో నెం.103ను విడుదల చేసింది. ఈ సవరణల ద్వారా అక్రిడిటేషన్ల కేటాయింపులో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడంతో పాటు, పత్రికలు, జర్నలిస్టులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నారు.
తాజా నిబంధనల ప్రకారం మీడియా యాజమాన్యాలు డెస్క్ జర్నలిస్టుల విభాగంలో కనీసం 33 శాతం మహిళలకు అవకాశం కల్పించడం తప్పనిసరిగా ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా అక్రిడిటేషన్ కోటాలో కూడా మహిళా జర్నలిస్టులకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని స్పష్టం చేసింది.
సర్క్యులేషన్ ఆధారంగా అదనపు అక్రిడిటేషన్ కార్డుల కేటాయింపుపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
- 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు,
- 1.50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో ఒక అదనపు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయనున్నారు.
రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీలో కూడా మార్పులు చేశారు. ఇప్పటికే ఉన్న సభ్యులతో పాటు,
- హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతినిధి,
- పెద్ద దినపత్రికల నుంచి ఒక డెస్క్ జర్నలిస్ట్ ప్రతినిధివీరిద్దరికి కొత్తగా కమిటీలో స్థానం కల్పించనున్నారు.
ఇకపై అక్రిడిటేషన్ నిబంధనల్లో ఎక్కడైనా ఉన్న ‘మీడియా కార్డు’ అనే పదాన్ని **‘అక్రిడిటేషన్ కార్డు’**గా పరిగణించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే గతంలో ఉన్న ‘ఉర్దూ బిగ్ న్యూస్ పేపర్’ అనే పదాన్ని **‘ఉర్దూ డైలీ న్యూస్ పేపర్’**గా మార్చుతూ సవరణ చేసింది.
ఈ సవరణల మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంకకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.

Post a Comment