విద్యార్థుల అన్నంలో విషం కలపాలంటూ ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ దారుణ ఆదేశాలు
విద్యార్థుల అన్నంలో విషం కలపాలంటూ ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ దారుణ ఆదేశాలు ఆడియో వైరల్… వార్డెన్ సస్పెన్షన్
సంగారెడ్డి, జనవరి 03 : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తనపై విద్యార్థులు ఫిర్యాదు చేశారన్న కోపంతో వార్డెన్ కిషన్ నాయక్ ఏకంగా విద్యార్థులను చంపేయాలంటూ హాస్టల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
వసతి గృహంలో విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, శారీరకంగా మరియు మానసికంగా వేధిస్తున్న వార్డెన్ తీరుపై విసిగిపోయిన విద్యార్థులు గురువారం రాత్రి కడ్పల్–సిర్గాపూర్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న అధికారులు హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు వార్డెన్ కిషన్ నాయక్‌పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే స్పందించారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడమే కాకుండా, విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ప్రవర్తించిన వార్డెన్ కిషన్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేస్తూ, వసతి గృహంలో భద్రతా ఏర్పాట్లు పెంచినట్లు తెలిపారు.

Post a Comment