డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 20 మంది మావోయిస్టుల లొంగిపోనున్నారు.
కగార్ ఆపరేషన్ తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద సరెండర్‌గా నమోదు
హైదరాబాద్, జనవరి 3: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (GLA) కీలక నేత బరిసె దేవా సహా మొత్తం 20 మంది మావోయిస్టులు నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. ఈ లొంగుబాటు ఘటనను తెలంగాణ పోలీసులు చరిత్రలోనే అతిపెద్ద సరెండర్‌గా అభివర్ణిస్తున్నారు.
బరిసె దేవాతో పాటు కంకణాల రాజిరెడ్డి, రేమ సహా పలువురు కీలక క్యాడర్ నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించిన దేవా లొంగిపోవడం భద్రతా వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
లొంగుబాటు సందర్భంగా బరిసె దేవా తన వద్ద ఉన్న 48 మౌంటెడ్ LMG ఆయుధాలుతో పాటు రూ.20 లక్షల నగదును రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం (SIB)కు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్థాయిలో ఆయుధాలు లొంగిపోవడం కగార్ ఆపరేషన్ అనంతరం ఇదే అతిపెద్ద ఘటనగా పోలీసులు పేర్కొన్నారు.
డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన వ్యూహాత్మక చర్యలు, ఇంటెలిజెన్స్ సమన్వయం ఫలితంగానే ఈ లొంగుబాటు సాధ్యమైందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌కు గాను తెలంగాణ SIB బృందాన్ని హోంశాఖ ప్రత్యేకంగా అభినందించింది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి స్థాపన దిశగా ఇది కీలక మలుపుగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని లొంగుబాట్లు జరిగే అవకాశముందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Post a Comment