పాఠశాల చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడిపిన మంత్రి సీతక్క
ములుగు, జనవరి 26: ములుగు బాలికల పాఠశాలతో పాటు ములుగులోని హాస్టల్‌లో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితులను మంత్రి సీతక్క మేడారంలో ఆత్మీయంగా కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడిపిన క్షణాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి.
మేడారం సందర్శన సందర్భంగా తన పాఠశాల రోజుల స్నేహితులు ఒక్కచోట చేరడంతో ఆ ప్రాంతం ఉత్సాహభరిత వాతావరణంతో నిండిపోయింది. చదువు రోజుల అనుభవాలు, అప్పటి సరదా క్షణాలను పరస్పరం పంచుకుంటూ స్నేహబంధాన్ని మరింత బలపరుచుకున్నారు.
ఈ సందర్భంగా మేడారంలోని సెల్ఫీ పాయింట్ల వద్ద స్నేహితురాళ్లతో కలిసి ఫోటోలు దిగిన మంత్రి సీతక్క, ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హోదా, పదవిని పక్కనపెట్టి సహజంగా స్నేహితులతో కలిసిపోయిన ఆమె తీరు అందరి మనసులను దోచుకుంది.
చిన్ననాటి స్నేహానికి ఇప్పటికీ అదే విలువ ఉందని, జీవితంలో స్నేహబంధాలు ఎప్పటికీ ప్రత్యేకమేనని మంత్రి సీతక్క ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Post a Comment