ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్లు, ఇన్‌స్టా రీల్స్.. ప్రభుత్వ టీచర్ గౌతమి సస్పెన్షన్
ఖమ్మం, జనవరి 26 : ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ హైస్కూల్‌లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ భూక్యా గౌతమిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలకు సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్లు చేయడం, పాఠశాల సమయంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం వంటి ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.
గత కొన్ని నెలలుగా గౌతమి నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్లకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా స్కూల్ పని సమయంలోనే రీల్స్ చిత్రీకరించడం ద్వారా సమయాన్ని వృథా చేస్తోందన్న ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు.
అయినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సస్పెన్షన్ తప్పదని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుచితంగా ప్రమోషన్లు చేయడం ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని డీఈవో హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Post a Comment