నల్లగొండ జిల్లాలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలు
నల్లగొండ, జనవరి 06 : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రేపు (బుధవారం) నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ నిర్ణయం ప్రకారం, జిల్లా పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయరాదు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిబంధన అమలులో ఎలాంటి సడలింపులు ఉండవని, ప్రతి పెట్రోల్ బంక్ నిర్వాహకుడు తప్పనిసరిగా దీనిని పాటించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్ యజమానులు, సిబ్బందికి ఈ నిబంధనపై అవగాహన కల్పించి, అమలుపై స్పష్టమైన సూచనలు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై కౌన్సిలింగ్ కార్యక్రమాలు, అవగాహన చర్యలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహనదారుల సంఖ్య అధికంగా ఉంటోందని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణనష్టం జరుగుతున్న ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయని ఎస్పీ వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ద్విచక్ర వాహనదారులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment