మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలపై డీఈవో నాగలక్ష్మికి మెమోరాండం
కొత్తగూడెం, జనవరి 06 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మధ్యాహ్నం భోజనం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) నాగలక్ష్మికు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి సత్తెనపల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వం ఒక్కో కోడి గుడ్డుకు కేవలం రూ.6 మాత్రమే చెల్లిస్తోందని, అయితే మార్కెట్లో కోడిగుడ్ల ధరలు రూ.9 నుంచి రూ.10 వరకు ఉన్నాయని తెలిపారు. ఈ ధరల వ్యత్యాసం కారణంగా మధ్యాహ్నం భోజనం కార్మికులు పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్లు సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నేరుగా కోడిగుడ్లను సరఫరా చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు విద్యార్థులకు కోడిగుడ్లు అందించలేమని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి సరఫరా వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, గత ఎనిమిది నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించలేదని, మధ్యాహ్నం భోజనం బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వెంటనే పెండింగ్ వేతనాలు, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని జిల్లా మధ్యాహ్నం భోజనం కార్మికుల తరఫున డీఈవోను కోరారు.
ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఉప ప్రధాన కార్యదర్శి సత్తెనపల్లి విజయలక్ష్మితో పాటు పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడు, కొత్తగూడెం మండలాల యూనియన్ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు పొదిలిమంగా, భూక్యకాంత, సీతమ్మ, రమాదేవి, సుగుణ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment