-->

తెలంగాణ శాసనసభలో ఐదో రోజు వాడివేడిగా చర్చలు

హిల్ట్ పాలసీ, సింగరేణి సంక్షేమం, పరిశ్రమలు–ఉద్యోగాలపై కీలక ప్రకటనలు


హైదరాబాద్, జనవరి 06: తెలంగాణ శాసనసభ సమావేశాల ఐదో రోజు వాడివేడిగా సాగింది. హిల్ట్ పాలసీ, సింగరేణి కార్మికుల సంక్షేమం, పరిశ్రమల ప్రోత్సాహం, ఐటీ రంగ అభివృద్ధి, ఈవీ పాలసీ వంటి అంశాలపై మంత్రులు కీలక ప్రకటనలు చేశారు. ప్రతిపక్ష ఆరోపణలకు మంత్రులు ఘాటుగా సమాధానాలు ఇచ్చారు.


హిల్ట్ పాలసీపై స్పష్టత ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తల భూములను ప్రభుత్వ భూములుగా ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అవి ప్రభుత్వ భూములు కాదని, గత ప్రభుత్వాలే దశాబ్దాల కిందట పరిశ్రమల కోసం అమ్మిన భూములని తెలిపారు.

ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతోనే హిల్ట్ పాలసీని తీసుకువచ్చామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ విధానం రూపొందించామని పేర్కొన్నారు. హిల్ట్ పాలసీ కింద ఆరు నెలల గడువు ఇస్తామని, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే భూముల కన్వర్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. పాలసీపై పూర్తి అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలన్నారు.


సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి అంశంపై అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక సమాధానాలు ఇచ్చారు. సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలను మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే 32 మంది వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని, 176 మంది పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. గోదావరిఖనిలో 75 రోజుల్లో క్యాత్ ల్యాబ్ ప్రారంభిస్తామని, రామగుండంలో పీపీపీ మోడల్‌లో క్యాత్ ల్యాబ్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.


పరిశ్రమలు–ఉద్యోగాలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటనలు

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మార్కెట్ ధర కంటే తక్కువకే పరిశ్రమలకు భూములు కేటాయించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఏపీలో 99 ఏళ్లకు 99 పైసలకే ఎకరం ఇస్తున్న పరిస్థితుల్లో పోటీ ఎలా పడాలో ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించారు.

ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నామని, పరిశ్రమల కోసం రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. సీఎం నేతృత్వంలో దావోస్ సదస్సులో పాల్గొని తెలంగాణ పాలసీలను ప్రపంచ పరిశ్రమల ముందు ఉంచుతామని తెలిపారు.

తెలంగాణ రైజింగ్ సదస్సులో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇప్పటికే 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు రాష్ట్రానికి రావడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని అన్నారు.


ఐటీ రంగంలో భారీ ఉద్యోగావకాశాలు

హ్యూసెంట్రియో, సిస్టా ఐటీ సంస్థల ద్వారా వెయ్యి చొప్పున ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తూ 5 వేల మందికి ఉపాధి కల్పించనుందని చెప్పారు. పోచారం ఇన్ఫోసిస్ విస్తరణతో 17 వేల మందికి, విప్రో విస్తరణతో మరో 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.

సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, జీనోమ్ వ్యాలీ నాలుగో దశ కూడా పూర్తయిందని తెలిపారు. ఐటీ కంటే ఎక్కువగా ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ఎగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.


ఈవీ పాలసీపై మంత్రి పొన్నం ప్రకటనలు

ఈవీ వాహనాల బ్యాటరీ సామర్థ్యం పెంపు, ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంపుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈవీ పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈవీ వాహనాలపై రాయితీల అమలుతో రూ.900 కోట్ల పన్ను నష్టం వచ్చినప్పటికీ, పర్యావరణ పరిరక్షణే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం వరకు తగ్గింపు ఇవ్వాలని కంపెనీలను కోరామని తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఇప్పటికే 575 ఆర్టీసీ ఈవీ బస్సులు నడుస్తున్నాయని, కొత్తగా 200కు పైగా బస్సులు రానున్నాయని చెప్పారు. వరంగల్‌కు 100, నిజామాబాద్‌కు 50 ఈవీ బస్సులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ చేయాలని, స్క్రాప్ పాలసీ కింద ప్రోత్సాహకాలు ఇచ్చేలా జీవో తీసుకొచ్చామని మంత్రి పొన్నం తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793