అమ్మలేదు.. నాన్నే కడతేర్చాడు తేలేరు గ్రామంలో విషాద ఘటన
పదేళ్ల క్రితం వివాహం
తేలేరు గ్రామానికి చెందిన శివరాములు అనే వ్యక్తికి పెద్ద చక్రం గ్రామానికి చెందిన మహిళతో సుమారు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు రిత్విక (8), చైతన్య (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం నాటి నుంచే భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు.
పిల్లలను వదిలి వెళ్లిన తల్లి
చైతన్య పుట్టిన కొన్ని నెలలకే ఆ మహిళ భర్తను, పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం కోర్టును ఆశ్రయించి విడాకులు కోరగా, గత ఏడాది మార్చిలో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుంచి శివరాములు తన ఇద్దరు పిల్లలనే లోకంగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
వ్యవసాయ పోలం వద్దే దారుణం
సోమవారం రాత్రి కూతురు రిత్వికకు జ్వరం రావడంతో స్థానిక వైద్యుడికి చూపించిన శివరాములు, ఆ తర్వాత పిల్లలను వ్యవసాయ కులం వద్దకు తీసుకెళ్లాడు. ఇదే చివరి అవకాశం అనుకున్న అతడు, ముందుగా ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ తాగాడు. అయితే మందు ప్రభావం చూపకపోవడంతో పిల్లలు చనిపోలేదు.
దీంతో అమానుషంగా ఇద్దరు పిల్లలను ఒకరి తర్వాత ఒకరిని గొంతునులిమి హత్య చేసి, కాలువ బురదలో పడవేశాడు. ప్రాణాలు మిగిలి ఉండవచ్చన్న అనుమానంతో వారిని బురదలో తొక్కినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆత్మహత్యకు విఫల ప్రయత్నాలు
అనంతరం శివరాములు ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకొని విద్యుత్‌షాక్‌తో చనిపోవాలని ప్రయత్నించాడు. అయితే షాక్ తగిలి దూరంగా పడిపోయాడు. తరువాత గడ్డపారతో పొడుచుకొని ఆత్మహత్యకు ప్రయత్నించినా శరీరం సహకరించలేదు. చివరకు మంగళవారం తెల్లవారుజామున తన బంధువులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేశాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ఎస్సై రాము ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని, కాలువ నుంచి పిల్లలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శివరాములను తొలుత మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి, పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం శివరాములు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
అంత్యక్రియలకు రాని తల్లి
పిల్లల తల్లికి సమాచారం ఇచ్చినా, “నాకు వాళ్లతో ఎలాంటి సంబంధం లేదు” అంటూ ఆమె రాకపోయినట్లు పోలీసులు తెలిపారు. భర్తపై ఎంత కోపం ఉన్నా, కనీసం పిల్లలను చివరిసారి చూడడానికి కూడా ఆమె రాకపోవడం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం సాయంత్రం ఇద్దరు చిన్నారుల అంత్యక్రియలను బంధువులు నిర్వహించారు. ఈ ఘటనతో తేలేరు గ్రామం మొత్తం విషాదఛాయలతో నిండిపోయింది.

Post a Comment