డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఆర్ ఆర్ ఆర్ ట్రావెల్స్ బస్సుగా దీనిని గుర్తించారు.
బస్సు ప్రయాణంలో ఉండగానే ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సును పక్కకు నిలిపి అందులో ఉన్న పదిమంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపాడు. కొద్ది నిమిషాల్లోనే బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు పూర్తిగా కాలిపోయినా, డ్రైవర్ తీసుకున్న తక్షణ నిర్ణయం వల్ల ప్రాణనష్టం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని డ్రైవర్ వెల్లడించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ అప్రమత్తత, సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Post a Comment