మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 07: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా పూర్తిగా తేలకపోయినా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చకచకా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. మార్చి నెలలో వార్షిక పరీక్షలు ఉండటంతో, ఆలోపే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, ఫిబ్రవరిలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది.
ఈ నెల 8న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో, సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో సుమారు అరగంటపాటు చర్చించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని, గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా సమర్థవంతమైన అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని సూచించినట్లు తెలిసింది. అభ్యర్థుల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, సర్వేలు మరియు ప్రజాభిప్రాయాన్ని ఆధారంగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించినప్పటికీ, జిల్లాల పూర్తి స్థాయి కార్యవర్గాలు ఇంకా ప్రకటించలేదని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 8న జరిగే కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో, ప్రతి డీసీసీ అధ్యక్షుడు తమ పూర్తి కార్యవర్గ జాబితాను పీసీసీ అధ్యక్షుడికి అందజేయాలని సీఎం సూచించినట్లు సమాచారం.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని బిల్లులపై, కృష్ణా జలాల పంపిణీ, హిల్ట్ పాలసీ వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ సభ్యులు సమర్థవంతంగా చర్చించారని, ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటైన సమాధానాలు ఇచ్చారని సీఎం మంత్రులను అభినందించినట్లు తెలిసింది. అదేవిధంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో జరుగుతున్న చర్చపై కూడా సీఎం, మంత్రులు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యాచరణ, వ్యూహాలపై ఈ నెల 8న జరిగే సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, డీసీసీ కార్యవర్గాల ఏర్పాటు తదితర అంశాలపై నాయకులందరి అభిప్రాయాలు సేకరించి ముందుకు వెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Post a Comment