-->

గ్రూప్‌-1 నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్


హైదరాబాద్, ఫిబ్రవరి 5 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత విజయవంతంగా చేపట్టిన తొలి గ్రూప్‌-1 నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను రద్దు చేస్తూ గత ఏడాది సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం 123 పేజీల తుది తీర్పును వెలువరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీతో పాటు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న విజయవంతమైన అభ్యర్థులకు భారీ ఊరట లభించింది.

సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు

గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో లోపాలు, డబుల్ హాల్‌టికెట్లు, పరీక్ష కేంద్రాల కేటాయింపులో వివక్ష, తెలుగు మాధ్యమ అభ్యర్థులకు అన్యాయం, ఎవాల్యుయేటర్ల ఎంపికలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేసిన సింగిల్ జడ్జి తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకుల జాబితాను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు.

ఈ తీర్పు తప్పులతడకగా ఉందని పేర్కొంటూ టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్‌లో రిట్ అప్పీళ్లు దాఖలు చేశారు.

డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు

వాదనలు విన్న ధర్మాసనం పలు అంశాలపై స్పష్టత ఇచ్చింది.

  • పరీక్షల నిర్వహణలో మాస్ కాపీయింగ్‌, పేపర్ లీకేజీ వంటి వ్యవస్థీకృత లోపాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.
  • ప్రిలిమినరీ, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఇవ్వడంపై నోటిఫికేషన్‌లో నిషేధం లేదని స్పష్టం చేసింది.
  • మహిళలకు మాత్రమే కేటాయించిన కొన్ని కేంద్రాలు లాజిస్టిక్ కారణాల వల్లే అని తెలిపింది.
  • ఎవాల్యుయేషన్ ప్రక్రియలో ఎవరికి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆధారాలు లేవని పేర్కొంది.
  • తెలుగు మాధ్యమ అభ్యర్థులకు వివక్ష జరిగిందని నిరూపించే డేటా లేదని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేస్తూ, టీజీపీఎస్సీతో పాటు విజయవంతమైన అభ్యర్థుల అప్పీళ్లను అనుమతిస్తూ తుది తీర్పు ఇచ్చింది.

“కుట్రలను ఛేదించి విజయం సాధించాం” – సీఎం రేవంత్ రెడ్డి

గ్రూప్‌-1 నియామకాలపై హైకోర్టు తీర్పును సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వకంగా స్వాగతించారు. ఎన్ని కుట్రలు పన్నినా ఉద్యోగ నియామకాలను అడ్డుకోలేకపోయారని, న్యాయ పోరాటంలో ప్రభుత్వం విజయం సాధించిందని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. గ్రూప్‌-1కు ఎంపికైన 563 మంది అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమవ్వాలని పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793