మునిసిపల్ ఎన్నికల వేళ ఖజానాకు భారీ ఆదాయం
హైదరాబాద్, ఫిబ్రవరి 5 : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో అమలు చేసిన నో డ్యూస్ నిబంధన పురపాలక శాఖకు భారీగా కలిసొచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా బకాయిలు లేనివారై ఉండాలనే నిబంధన కారణంగా, రాజకీయ నాయకులు తమపై మరియు వారి కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న బకాయిలను భారీ మొత్తాల్లో చెల్లించారు.
నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ వంటి ప్రధాన కార్పొరేషన్ల నుంచి అత్యధికంగా బకాయిలు వసూలయ్యాయి. ఎన్నికల కారణంగా రాజకీయ నాయకుల మొండి బకాయిలు సులభంగా వసూలవుతున్నాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రత్యేక బకాయిల వసూలు డ్రైవ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నేపథ్యంతో నెల రోజుల వ్యవధిలోనే రూ.60 కోట్ల ఆదాయం సమకూరినట్లు సీడీఎంఏ వర్గాలు తెలిపాయి.
బకాయిల వసూళ్లను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంట్ (OTS) అవకాశం కల్పించింది. ఆస్తి పన్నుపై వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వాలని పురపాలక శాఖ నిర్ణయించింది.

Post a Comment