వరంగల్–కరీంనగర్ జంట నగరాల సమగ్రాభివృద్ధికి బృహత్ ప్రణాళిక
కరీంనగర్ | ఫిబ్రవరి 05: వరంగల్ – కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళికను ప్రకటించారు. ఈ రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లను పూర్తి చేయడంతో పాటు, వాటిని పరస్పరం అనుసంధానం చేస్తూ రోడ్ల విస్తరణ చేపడతామని తెలిపారు. అలాగే ఈ రెండు నగరాల మధ్య దేశంలోనే అతి పెద్ద డంప్ యార్డ్‌ను ఏర్పాటు చేసి, అక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండిలో రూ.45.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)కు, గంగాధర మండలంలో రూ.5 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు విమానాశ్రయాన్ని పూర్తి చేసి, కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ రెండు పట్టణాలను జంట నగరాలుగా అభివృద్ధి చేసి, దేశానికే ఆదర్శంగా నిలిచే మున్సిపల్ కార్పొరేషన్లుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్ బాసర నుంచి ఖమ్మం, భద్రాచలం వరకు ఉన్న అన్ని దేవాలయాలను సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. అవసరమైతే నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు, మధ్యలో అటవీ ప్రాంతాల్లో ఎకోటూరిజాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయం పండగగా మారాలన్న లక్ష్యంతో రూ.2 లక్షల వరకు రుణమాఫీ, గిట్టుబాటు ధర, సన్నవడ్లకు బోనస్, రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి దేశంలోనే అత్యధికంగా రూ.1.15 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
గత రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. బీసీ, ఎస్సీ హాస్టళ్ల పరిస్థితిని మెరుగుపర్చేందుకు వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, అలాగే సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెస్ చార్జీలను 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు వివరించారు.
మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న లక్ష్యంతో ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రూ.27 వేల కోట్ల రుణాలు అందించామని చెప్పారు. మహిళా సంఘాలకు వెయ్యి బస్సులు, పెట్రోల్ బంకులు, వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు.
ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో చేసిన అభివృద్ధిని శాసనసభ వేదికగా వివరించడానికి సిద్ధంగా ఉన్నామని, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ సభలో జిల్లా ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా కరీంనగర్ శ్రీ సీతారామచంద్ర జిల్లా మహిళా సమాఖ్యకు సీఎం రూ.110.10 కోట్ల చెక్కును అందజేశారు.

Post a Comment