నాన్‌వెజ్ ప్రియులకు శుభవార్త.. ఒక్కసారిగా పడిపోయిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో నాన్‌వెజ్ ప్రియులకు ఊరట కలిగించే వార్త. ఇటీవల భారీగా పెరిగిన చికెన్ ధరలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. సంక్రాంతి, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ముగిసిన తర్వాత చికెన్‌పై డిమాండ్ తగ్గడంతో ధరలు దిగొస్తున్నాయి.
గత నెలలో పండుగలు, జాతరల కారణంగా వివిధ ప్రాంతాలకు కోళ్ల సరఫరా పెరిగింది. అదే సమయంలో ఉత్పత్తి తగ్గడంతో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే ప్రస్తుతం పండుగల సీజన్ ముగియడంతో డిమాండ్ తగ్గింది. కోళ్ల ఉత్పత్తి పెరగడంతో మార్కెట్‌లో సరఫరా మెరుగుపడింది. దీని ప్రభావంతో గత కొద్దిరోజులుగా చికెన్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.
ప్రస్తుతం చికెన్ ధరలు ఇలా..
గత నెలలో కేజీ చికెన్ ధర రూ.300 నుంచి రూ.350 వరకు పలికింది. కానీ ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు కిలో చికెన్ సగటున రూ.240కే లభిస్తోంది. గత నెలతో పోలిస్తే దాదాపు రూ.100 వరకు తగ్గుదల నమోదైంది.
- రిటైల్ మార్కెట్‌లో లైవ్ చికెన్ – రూ.140
- డ్రెస్‌డ్ చికెన్ – రూ.220
- స్కిన్‌లెస్ చికెన్ – రూ.240 నుంచి రూ.250 వరకు
ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫారాల్లో కోళ్ల ఉత్పత్తి పెరగడంతో రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
తగ్గిన కోడిగుడ్ల ధరలు
చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా తగ్గాయి. మొన్నటివరకు ఒక్కో గుడ్డు రూ.9 వరకు పలకగా.. ఇప్పుడు ఒక్కసారిగా తగ్గింది. ప్రస్తుతం ఒక్కో గుడ్డు రూ.6కే లభిస్తోంది. రెండు నెలలుగా స్థిరంగా ఉన్న గుడ్ల ధరలు తగ్గడంతో సామాన్యులకు ఇది ఊరట కలిగించే అంశంగా మారింది.
ఇటీవల కొన్ని ప్రాంతాల్లో గుడ్డు ధరలు రూ.10 వరకు చేరగా, నాటుకోడి గుడ్లు రూ.20 వరకు పలికాయి. ఇప్పుడు అవి కూడా తగ్గుముఖం పట్టాయి.
గత నెల ధరలు రికార్డు స్థాయిలో..
సంక్రాంతి సందర్భంగా బ్రాయిలర్ చికెన్ కేజీ రూ.350 వరకు పలికింది. మటన్ ధరలు రూ.1500కు చేరుకోగా, నాటుకోడి చికెన్ అయితే ఏకంగా కేజీ రూ.3,000 వరకు చేరి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి వినియోగదారులు బయటపడుతున్నారు.
చికెన్, గుడ్ల ధరలు తగ్గడంతో సామాన్య కుటుంబాల ఇంటి ఖర్చులు తగ్గనున్నాయి. నాన్‌వెజ్ ప్రియులు ఇక కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది.

Post a Comment