జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయం
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్; ఫిబ్రవరి 05: మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్న తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం అభినందనీయమని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణీతో పాటు అకాడమీ ప్రచురించిన చిరుపుస్తకాలు (మోనోగ్రాఫ్స్) ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావుతో కలిసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్షరమే ఆయుధంగా ప్రజాసేవ చేస్తున్న జర్నలిస్టులు అకాల మరణానికి గురవడం బాధాకరమన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, ఐదు సంవత్సరాల పాటు పెన్షన్ సదుపాయం కల్పించడం వారికి గట్టి అండగా నిలుస్తుందన్నారు. అలాగే పాత్రికేయ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖ జర్నలిస్టుల జీవిత విశేషాలను మోనోగ్రాఫ్స్ రూపంలో ప్రచురించడం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా విస్తరిస్తున్నప్పటికీ తాను ఇప్పటికీ పత్రికలు చదవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు మాట్లాడుతూ, ప్రముఖుల చరిత్రను పుస్తకరూపంలో అందించడం సులభమే అయినా, అదే సమాచారాన్ని మోనోగ్రాఫ్‌లుగా తీర్చిదిద్దడం గొప్ప కృషి అని అన్నారు. వార్త సమాజానికి అద్దం అయితే, ఆ వార్త వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసే జర్నలిస్టులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులని పేర్కొన్నారు. సోషల్ మీడియాను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని, అయితే దీనిపై జర్నలిస్టులు సమిష్టిగా చర్చలు, వర్క్‌షాప్‌లు నిర్వహించి మార్పుకు నాంది పలకాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, చనిపోయిన 18 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులు అందజేశామని తెలిపారు. అదేవిధంగా ప్రమాదానికి గురైన ఒక జర్నలిస్టుకు రూ.50 వేల ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. ప్రముఖ పాత్రికేయులపై అకాడమీ ప్రచురించిన 10 మోనోగ్రాఫ్స్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment