డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం 11.4 కిలోల ఎండు గంజాయితో మహిళ అరెస్ట్
హైదరాబాద్, ఫిబ్రవరి 7 : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నియంత్రణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తు పదార్థాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో కమిషనర్ టాస్క్‌ఫోర్స్ వెస్ట్‌జోన్ టీమ్, ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది.
పోలీసులు ఓ మహిళను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 11.4 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5.7 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అరెస్టైన మహిళను రినిత రాయితగా గుర్తించారు.
పోలీసుల విచారణలో రినిత వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలకు సబ్-పెడ్డలర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. ఆమె స్వస్థలం ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, అంతరాబా పోస్టు పరిధిలోని కేసరిగూడ గ్రామంగా పోలీసులు వెల్లడించారు.
టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ మొహమ్మద్ ఇక్బాల్ సిద్ధిక్ తెలిపిన వివరాల ప్రకారం, రినిత తన వరస సోదరుడు మానియెల్ దలబెహెరాతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి, నగరంలోని వివిధ ప్రాంతాల్లో కస్టమర్లకు డ్రై గంజాయి విక్రయిస్తూ అక్రమంగా సంపాదన పెంచుకునే ప్రయత్నం చేసింది. కొంతకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తూ, డ్రగ్స్‌కు అలవాటు పడిన యువతను టార్గెట్ చేసి గంజాయి సరఫరా చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
టాస్క్‌ఫోర్స్‌కు అందిన పక్కా సమాచారంతో వెస్ట్‌జోన్ టీమ్, ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు వలపన్ని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా భారీగా ఎండు గంజాయి లభ్యమైంది. వెంటనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
డ్రగ్స్ అనేవి జీవితాన్ని నాశనం చేసే మహా శత్రువని పోలీసులు హెచ్చరించారు. వాటి బారిన పడి యువత తమ భవిష్యత్తును పాడుచేసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ను విడిచిపెట్టలేక ఇబ్బంది పడుతున్న వారు పోలీసులను సంప్రదిస్తే కౌన్సిలింగ్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు.

Post a Comment