బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత
మంచిర్యాల, ఫిబ్రవరి 07 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం సుమారు 40 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
నిన్న రాత్రి వండిన మిల్ మేకర్ కూరతో పాటు అన్నం తిన్న తర్వాత విద్యార్థినిలకు ఒక్కసారిగా వాంతులు, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. పలువురు విద్యార్థినులు స్పృహ కోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలారు.
అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థినులు చెప్పినా, వాటిని పారేయకుండా అలానే తినాలని వార్డెన్, సిబ్బంది కర్కశంగా ప్రవర్తించారని బాలికలు ఆరోపిస్తున్నారు. భోజనం అనంతరం విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో 108కు కాల్ చేయాలని వేడుకున్నా, హాస్టల్ సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫుడ్ పాయిజన్ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా, హాస్టల్ వార్డెన్ స్థానిక ఆర్ఏంపీ వైద్యుడితో ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇప్పించిందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
సాయంత్రం 7:30 గంటలకే అస్వస్థత విషయం తెలియజేసినా, రాత్రి 10 గంటల వరకు వార్డెన్ రాకపోవడంతో మూడు గంటలు నరకం అనుభవించామని బాలికలు వాపోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై అధికారులు స్పందించి, వసతి గృహంలో జరిగిన నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Post a Comment