-->

వార్డు ఒక్కటే.. అభ్యర్థుల పేరూ ఒక్కటే! శంకర్‌పల్లి ఎన్నికల్లో వింత పోరు

వార్డు ఒక్కటే.. అభ్యర్థుల పేరూ ఒక్కటే! శంకర్‌పల్లి ఎన్నికల్లో వింత పోరు


Hyderabad; Feb 07: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పురపాలిక ఎన్నికల్లో ఓ అరుదైన, ఆసక్తికర రాజకీయ సమరం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, ఒకే పేరుతో, ఒకే వార్డు నుంచి ప్రత్యర్థులుగా బరిలోకి దిగడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

శంకర్‌పల్లి మున్సిపాలిటీ రెండో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరు, భారాస (బీఆర్ఎస్) తరఫున మరో మహిళ పోటీ చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వీరిద్దరి పేర్లు ‘బీసోళ్ల సంధ్యారాణి’ కావడం విశేషం. అంతేకాదు, వీరిద్దరి భర్తలు వరుసకు అన్నదమ్ములు కావడం రాజకీయ వాతావరణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.

ఒకే పేరు, ఒకే ఇంటిపేరు ఉండటంతో ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని భావించిన అభ్యర్థులు, తమ పేర్లకన్నా పార్టీ గుర్తును గమనించి ఓటు వేయాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలోనూ ఇదే అంశాన్ని ప్రధానంగా వివరిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు తోడికోడళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు ప్రస్తుతం శంకర్‌పల్లి మాత్రమే కాకుండా నియోజకవర్గవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వింత పోరులో గెలుపు ఎవరిదోనన్న ఉత్కంఠ స్థానికుల్లో పెరుగుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793