-->

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు ఇద్దరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు


హైదరాబాద్, ఫిబ్రవరి 7: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం సమీపంలో అతివేగంగా వెళ్తున్న వెన్యూ కారు అదుపుతప్పి రింగ్ రోడ్డుపై నుంచి ఒక్కసారిగా కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడిపోయింది.

ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక మహిళ, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రమాద సమయంలో కారులో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్న పాప ప్రయాణిస్తున్నారు. వీరంతా శంషాబాద్ విమానాశ్రయం నుంచి బాచుపల్లి వైపు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిగిలిన ఐదుగురిని స్థానికులు, పోలీసులు వెంటనే పటాన్చెరులోని ధ్రువ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

కారు కింద పడిన సమయంలో సర్వీస్ రోడ్డుపై ఇతర వాహనాలు లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బాధితుల కుటుంబాలకు సమాచారం అందించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793